రెప్పలుమోయని - TopicsExpress



          

రెప్పలుమోయని దుఃఖం ------------------------- నేనీమధ్యనే మందహాసాన్ని జారవిడుచుకొని ప్రశ్నార్దకాల్ని మోస్తున్నాను ఆత్మశూన్య దేహంతో అన్వేషణ సాగించలేక అనుభవాల ఆకురాయిమీద నిత్యం ఘర్షణ పడుతూ ముందుకు సాగుతున్నాను జీవితాన్ని ఎంతగా తడిమినా ఏదో ఒక పార్శ్వం నా స్పర్శకందకుండా జారిపోతూనేవుంది దిగులు వర్ణాలన్నీ దుఃఖంతో తడిసిపోయి శిల్పంగా చిక్కబడుతున్నాయి ఒక నాజూకు చేతన నామనసు మడతల్లో నలిగి పోతూనే ఉంది పదచిత్రాలన్నీ పరవశత్వం కోల్పోయి ఊహలన్నీ ఉద్రేకాల్ని మోస్తున్నాయి అనాదిగా నిద్రకూ మెలకువకూ మధ్య నిత్య జాగ్రదావస్థలో విస్తరించే విద్వంసమే నన్ను శాసిస్తోంది సకల స్వార్థాలతో కాలుష్యమైనవారికి సార్వజనీన సత్యాలేవి చెవికెక్కవు క్షీర ధారల్నిపొదుగునిండా నింపుకొని కట్టుగొయ్యకు పెనుగులాడే లేగదూడ కోసం ఆర్తిగా చూస్తూ అంబా అని పిలుస్తోంది మాతృహృదయం అయినా,పాలవ్యాపారి హృదయం కరుగుతుందా డబ్బును ప్రేమించే మనసు వాత్సాల్యానికి లొంగదు కులాల్ని ప్రేమించినంత ఇష్టంగా మనుషుల్ని ప్రేమించలేరు కరచాలనం కోసం చాచిన చేతులు కౌగిలించుకోడానికి ముందుకు రావు పూల పరిమళాల్ని ముళ్ళపొదలు అస్వాదిస్తాయా ప్రేమించడమే నేరమైన చోట జీవితం హింసాత్మక సన్నివేశమే గాయాలను ఒరుసుకుంటూ జ్ఞాపకాలు ప్రవహిస్తాయి జ్ఞాపకమంటే చిగురాకు చలనం హృదయవీణా తంత్రీ ప్రకంపనం ఊహల్లోంచీ ఉత్ప్రేక్షలొస్తాయి కానీ ఊకల్లోంచీ గట్టి గింజలు రాల్తాయా? ప్రేమించగల వాడెప్పుడూ ద్వేషించలేడు మమకారం తెలీనివాడు మనిషెలా అవుతాడు? మానవ సంబంధ భాష్యకారులారా! సంక్షోభాలు, సందిగ్ధాలు లేని సరికొత్త జీవితాన్ని నిర్వచిస్తారా? ఈ మట్టిని ఈ మనిషిని ప్రేమించే మనుషులకోసం తపిస్తున్నాను నేను మానవీయ ప్రేమ తత్వాన్ని ఈ మనుషులకు విశదీకరించండి!! (అవిశ్రాంతం నుండి)
Posted on: Sun, 14 Sep 2014 12:23:24 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015