నూతన శీర్షిక - TopicsExpress



          

నూతన శీర్షిక ప్రారంభం కథాయణం - 1 - అనిల్ ఎస్. రాయల్ ‘కథాయణం’ శీర్షికన వారం వారం కథలు రాయటంలో మెళకువలు వివరించమని షరీఫ్ అభ్యర్ధన. కథ గుంపులోని ఔత్సాహిక రచయితలకి అవి ఉపయోగపడతాయని ఆయన ఆశ. చిట్కాలతో మంచి కథలు రాలవు. అంతమాత్రాన నాకు తెలిసినవీ, నేను పాటించేవీ నాలుగు కిటుకులు పదుగురితో పంచుకుంటే పోయేదేమీ లేదు. అందువల్ల ఈ వ్యాసాలు రాయటానికి పూనుకున్నాను. ఇవి ప్రధానంగా కథా రచనలో నేనవలంబించే పద్ధతులు విపులీకరించే వ్యాసాలు. కాబట్టి వీటిలో నా కథల ప్రస్తావన, వాటికి సంబంధించిన తెర వెనక విశేషాలు తరచూ కనిపిస్తుంటాయి. ఇది కథలు ‘ఇలాగే రాయాలి అంటూ రుద్దే ప్రయాస కాదు; ఇలాగూ రాయొచ్చు అని చెప్పే ప్రయత్నం. ఇందులో వివరించే కిటుకులేవీ నేను కనిపెట్టినవి కావు; నేను పాటించేవి మాత్రమే. అందువల్ల వాటి మీద నాకు అంతో ఇంతో అవగాహనుంది. అన్ని చింతలకీ ఇవే మంత్రాలన్న అజ్ఞానం మాత్రం లేదు. వీటిలో కొన్ని నేను రాసే తరహా genre కథలకి మాత్రమే వర్తించే విషయాలు. మరి కొన్ని అన్ని రకాల కథలకీ పనికొచ్చే సంగతులు. వీటిలో కొన్నైనా మీకెవరికన్నా ఉపయోగపడితే సంతోషమే. ఇంతటితో ఈ ఉపోద్ఘాతం ఆపి, ఈ వారం విషయంలోకి దూకుదాం. ఎత్తుగడ ... రెండు నెలలయింది ఫలానా పత్రిక్కి కథ పంపి. ఇంకా రిప్లై లేదు అద్భుతమైన కథ రాశానండీ. ఏం లాభం. ఎడిటర్ గారు సాంతం చదవకుండా అవతల పడేశారట! ఎన్ని కథలు పంపినా తిరిగొచ్చేస్తున్నాయి. అసలు వాళ్లు చదివిందీ లేనిదీ కూడా తెలీటం లేదు. ప్చ్. ఇక రాయటం మానేద్దామనుకుంటున్నా ఔత్సాహిక కథకులకి ప్రోత్సాహం తక్కువనీ, ఇంకోటనీ ఎలాంటి వదంతులు చెలామణిలో ఉన్నా - సాధారణంగా మన ఎడిటర్లు కొత్త కథకులని బాగా ప్రోత్సహిస్తారన్నది నా స్వీయానుభవం. కథ ఏ మాత్రం బాగున్నా దానికి సానబెట్టేందుకు విలువైన సూచనలు అందించే ఎడిటర్లున్నారు. తిప్పి పంపే కథలకి సైతం లోపాలెక్కడున్నాయో ఓపిగ్గా వివరించే ఎడిటర్లూ ఉన్నారు. మరి పై వ్యాఖ్యలకి అర్ధమేంటి? ఆయా ఎడిటర్లు సదరు కథల్ని పూర్తిగా చదవలేకపోయారని. చాలా సందర్భాల్లో దానిక్కారణం - ఆ కథ ఎత్తుగడ ఆకట్టుకునేలా లేకపోవటం. కాసేపు మీరో ప్రముఖ వారపత్రిక ఎడిటర్ అనుకోండి. రోజూ మీ డెస్క్ మీదకి డజన్ల కొద్దీ కథలొచ్చి వాలుతుంటాయి. అవన్నీ తీరిగ్గా చదవటమొక్కటే మీ పని కాదు కదా. ఎడిటరన్నాక తలమునకలయ్యే బాధ్యతలు మరెన్నో ఉంటాయి. వాటి మధ్యలో వీలు కుదుర్చుకుని ఎలాగోలా ఈ కథలన్నీ చదవాలి. అప్పుడేం చేస్తారు మీరు? చదవబోయిన కథ మొదటి నాలుగైదు పేరాల్లోనే మిమ్మల్ని కట్టిపడేయకపోతే దాన్ని అవతల పడేసి తర్వాతి కథనందుకుంటారు. అవునా? ఇప్పుడు ఎడిటర్ పాత్రనుండి పాఠకుడి పాత్రలోకి మారండి. మీరో కథల పుస్తకం చదివే పని పెట్టుకున్నారు. ఏ నవలో, నవలికో కాకుండా కథల పుస్తకం చదువుతున్నారంటే - మీకు పేజీల కొద్దీ సాగే పెద్ద పెద్ద రచనలు చదివే తీరికో లేక ఓపికో లేక అవి రెండూనో లేవన్న మాట. మరిప్పుడు మీకెదురైన కథ మొదట్లోనే ఆకట్టుకోకపోతే, అసలుకే అసహనమూర్తులైన మీరేం చేస్తారు? శుభ్రంగా తర్వాతి కథలోకి పేజీ తిప్పేస్తారు. కాదా? చిట్టి కథకి మొదలు, ముగింపు రెండూ ముఖ్యమే. కానీ వాటిలో మొదలు కాస్త ఎక్కువ ముఖ్యం. ఎందుకంటే - ఆ కథ అచ్చయ్యేదీ లేనిదీ; ఒకవేళ ఎలాగోలా అచ్చైతే హిట్టయ్యేదీ లేనిదీ తేల్చేది అదే కాబట్టి. మొదటి నాలుగైదు వాక్యాల్లోనే ఆకట్టుకోలేని కథ ఆ తర్వాత ఎంత గొప్పగా ఉన్నా పూర్తిగా చదివించటం కష్టం. చదరంగంలో మొదటి ఎత్తు ఎంత ముఖ్యమో, కథకి ఎత్తుగడ అంత ముఖ్యం. అయితే - మొదటి ఎత్తు బ్రహ్మాండంగా వేసినంత మాత్రాన గెలుపు మనదే అవుతుందని గ్యారంటీ లేనట్టే, ఎత్తుగడ అదిరిపోయినంత మాత్రాన కథ ఆటోమేటిక్‌గా గొప్పదై పోదు. కానీ కథపై పాఠకుడు ఓ అంచనాకొచ్చేది, మిగతా కథంతా చదవాలో వద్దో నిర్ణయించుకునేది దాని ఎత్తుగడ ఎలా ఉందనేదాన్ని బట్టే. కాబట్టి కథ ఎత్తుగడ విషయంలో నేను అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తాను. అత్యవసరమైతే తప్ప కథని ఆకాశం మేఘావృతమై ఉంది”, “కొమ్మమీద కోయిల ఉండీ ఉండీ కూస్తుంది” వంటి వర్ణనలతో మొదలెత్తుకోను. అత్యవసరమైనా కూడా రామారావు నట్టింట్లో చిరాగ్గా పచార్లు చేస్తున్నాడు, ఎనిమిదిన్నరైనా రాని పనిపిల్లని తిట్టుకుంటూ అంట్లు ముందరేసుకు కూర్చుంది సుమతి వంటి సర్వ సాధారణమైన సన్నివేశంతో మొదలెట్టను. మొదటి వాక్యంతోనే పాఠకుడి దృష్టి ఆకట్టుకోటానికి ప్రయత్నిస్తాను. కథ మొదలు పెట్టటానికి చాలా పద్ధతులున్నాయి: సంభాషణతో, కీలక పాత్ర చిత్రీకరణతో, ఎకాఎకీ యాక్షన్‌లోకి దిగిపోవటంతో, కథలో కీలకాంశాన్ని సూచించే వ్యాఖ్యానంతో, పరిసరాల వర్ణనతో, వగైరా. ఎలా మొదలెట్టినా, ఆ ప్రారంభ వాక్యాలు పాఠకుల్లో ప్రశ్నలు రేపెట్టేలా చెయ్యాలి. ఓ (కల్పిత) ఉదాహరణ చూద్దాం: ———— సాధారణ ఎత్తుగడ: పెద్ద శబ్దంతో వేగంగా వచ్చి ఆగింది పోలీస్ జీప్. అందులోంచి దిగి బూట్లు టకటకలాడించుకుంటూ వడివడిగా లోపలికెళ్లాడు ఇన్‌స్పెక్టర్ ప్రతాప్, గుమ్మంలో నిలబడున్న సెంట్రీ సెల్యూట్‌ని స్వీకరించినట్లు తలపంకిస్తూ. అతన్ని చూడగానే రైటర్‌తో హస్కు కొట్టటం ఆపేసి చటుక్కున లేచి అటెన్షన్‌లో నిలబడి సెల్యూట్ చేశాడు హెడ్ కానిస్టేబుల్ సుబ్రావ్. అతని తొట్రుపాటు గమనించి లోలోపలే నవ్వుకుంటూ, పైకి మాత్రం ముఖం నిండా గంభీరత నింపుకుంటూ హుందాగా నడుస్తూ వెళ్లి తన సీట్‌లో ఆసీనుడయ్యాడు ప్రతాప్. అప్పుడే డెస్క్‌మీద ఫోన్ మోగింది. ప్రతాప్ సైగ చెయ్యగానే అందుకుని అవతలి వాళ్లు చెప్పిన విషయం విని పెట్టేశాడు సుబ్రావ్. ఏమిటన్నట్లు చూస్తున్న ప్రతాప్‌తో చెప్పాడు. సైదా పేట ఎమ్మెల్యేగారింటి నుండి సార్” “ఏమిటి సంగతి? మళ్లీ వాళ్లావిడ పెంపుడు పిల్లి తప్పిపోయిందా?, చిరాగ్గా ప్రశ్నించాడు ప్రతాప్. లేదు సార్. ఈ సారి వాళ్లబ్బాయి. రాత్రి నుండీ కనబడటం లేదట ———— మెరుగైన ఎత్తుగడ: మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి. లోపల గొళ్లెం వేసినట్లే ఉంది. ఐనా వాడు అదృశ్యమైపోయాడు! ఎలా సాధ్యం? అరగంటగా తలబద్దలు కొట్టుకుని ఆలోచిస్తున్నా అంతుపట్టటం లేదు ఇన్స్‌పెక్టర్ ప్రతాప్‌కి. ———— పై ప్రారంభ వాక్యం చదవగానే పాఠకుల్లో కలిగే స్పందన: ఎవడు వాడు? ఎందుకు మాయమైపోయాడు? ఎలా మాయమైపోయాడు? ఎక్కడికి పోయాడు? కుతూహలంతో వాళ్ల కళ్లు తర్వాతి అక్షరాల మీదకి పరుగులు తీస్తాయి. ఇక్కడ మూడే లైన్లలో కథలో ఉన్న సమస్య చెప్పేశాం. దాన్ని ఇన్స్‌పెక్టర్ ఎలా అధిగమిస్తాడనే కుతూహలం కలిగించగలిగాం. ఇలా ఆదిలోనే పాఠకుల్లో ప్రశ్నలు రేకెత్తించగలిగితే ఆ ఎత్తుగడ ఫలించినట్లే. ఐతే అన్నిసార్లూ ఉత్సుకత కలిగించే వాక్యాలతో కథ మొదలు పెట్టటం సాధ్యపడదు. వర్ణనలతో మొదలు పెట్టి తీరాల్సిన సందర్భాలూ తటస్థపడతాయి. ఏ వాతావరణ నివేదికలైతే నీరసంగా ఉంటాయని భావిస్తానో వాటితోనే ‘శిక్ష మొదలు పెట్టాల్సొచ్చింది. ఆ నీరసం వదిలించటానికి ప్రాస మీద ఆధారపడ్డాను. ఇలాంటప్పుడు నేను తప్పనిసరిగా గుర్తుంచుకునే విషయం ఒకటుంది: మొదటి పేరా ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది. కథలో మొదటి పేరా మరీ పెద్దగా ఉందంటే, నేను కథని సెటప్ చెయ్యటానికి (పాత్రల పరిచయం, పరిసరాల వర్ణన, మొ.) మరీ ఎక్కువ సమయం తీసుకుంటున్నానని అర్ధం. అది ఆదిలోనే విసుగెత్తించే ప్రమాదముంది. అందువల్ల నేనెప్పుడూ కథలో మొట్టమొదటి పేరాగ్రాఫ్ మూడు లేదా నాలుగు లైన్లకి మించకుండా జాగ్రత్తపడతాను. అంతకన్నా చిన్నగా ఉంటే మరీ మంచిది (ఈ వ్యాసమూ అలాగే మొదలయింది, గమనించండి) మొత్తమ్మీద, ఎత్తుగడ అనేది వీలైనంత క్లుప్తంగా ఉండి తర్వాత జరగబోయే కథపై ఉత్సుకత కలిగించటం అతి ముఖ్యం. అనుభవజ్ఞులైన ఎడిటర్లు ఆరంభం చదవగానే ఆ కథ మంచీ చెడుల్ని అంచనా వేయగలుగుతారు. వాళ్లని తొలి రెండు మూడు పేరాగ్రాఫుల్లో ఆకట్టుకోలేని ఎత్తుగడతో కూడిన కథ చేరేది చెత్తబుట్టలోకే. ఇది వర్ధమాన రచయితలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయం. నా తొలికథ నాగరికథ కేవలం దాని ప్రారంభ వాక్యాల మూలానే ఎడిటర్ దృష్టిని ఆకర్షించింది. అవేంటో చూద్దాం: ——————————— మీ దగ్గరో టైమ్‌మెషీన్ ఉంది. దాన్లో మీరు కాలంలో డెభ్బయ్యేళ్లు వెనక్కెళ్లి మీ తాతగారు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే ఆయన్ని చంపేశారనుకుందాం. అప్పటికింకా ఆయనకి పెళ్లవలేదు కాబట్టి మీ నాన్నగారు పుట్టే అవకాశం లేదు. అంటే మీరు పుట్టే అవకాశమూ లేదన్నమాట. అప్పుడు మీరు కాలంలో వెనక్కెళ్లి మీ తాతగారిని చంపేసే అవకాశమూ లేదు. అంటే మీ తాతగారు బతికే ఉంటారు, మీ నాన్నగారూ ఉంటారు, మీరూ ఉంటారు. అప్పుడు మీరు కాలప్రయాణం చేసి మీ తాతగార్ని చంపేసే అవకాశమూ ఉంది. అంటే .... ——————————— పై ఎత్తుగడ కథంతా పూర్తయ్యాక జతచేయబడింది. కథలో ఈ వాక్యాలు అమరటం కోసం ఏకంగా ఒక క్లాస్‌రూమ్ సన్నివేశాన్నే కల్పించాల్సొచ్చింది. ఆ సన్నివేశం కృతకంగా కనిపించకుండా ఉండటానికి దాన్ని ప్రధాన పాత్ర పరిచయం కోసం కూడా వాడుకున్నాను. అందుకోసం అప్పటికే పూర్తయిన కథలో అక్కడక్కడా మార్పులు చేయాల్సొచ్చింది. ఆ ప్రయాస వృధా పోలేదనేదానికి నాగరికథ తెచ్చుకున్న గుర్తింపే రుజువు. ఆ అనుభవం అనుకోండి, మరోటనుకోండి .... నా కథలన్నిటికీ ప్రారంభవాక్యాలు చిట్టచివర్లో రాయటం అలవాటుగా మారింది. ఇలా చెయ్యటం వల్ల ఓ ఉపయోగం కూడా ఉంది: ఆకట్టుకునే ఎత్తుగడ కోసం ఆలోచిస్తూ కూర్చుని కథ ఎన్నటికీ మొదలెట్టకపోయే ప్రమాదం తప్పిపోతుంది. మొత్తం కథ పూర్తయ్యాక దానికి తగ్గ ఎత్తుగడ ఆలోచించటం నా పద్ధతి. మీకు ఎలా కుదిరితే అలా చేయండి. ఎత్తుగడపై మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఇదంతా చదివాక మీలో కొందరు ఆఁ సింగినాదం. చప్పగా మొదలై తర్వాత పుంజుకున్న గొప్ప కథలెన్ని లేవు అనొచ్చు. అదీ నిజమే. మీరూ అలా ప్రయత్నించొచ్చు, ఆపేవారెవరూ లేరు. మీ పేరు కొడవటిగంటి, ఓల్గా, రంగనాయకమ్మ లేదా యండమూరి అయ్యుంటే ఆరంభం అదిరిపోయిందా లేదా అనేదానితో పనిలేకుండా అందరూ కథ ఆసక్తిగా చదువుతారు. లేకపోతే అవతల పడేస్తారు. మనకంటూ ఓ గుర్తింపొచ్చాక, మొదలు ఎలా ఉన్నా మనకున్న పేరు కథ ఆసాంతమూ చదివించగలదనే నమ్మకమొచ్చాక ఏం చేసినా చెల్లుతుంది. అప్పటిదాకా, తిప్పలు తప్పవు. అదండీ ఈ వారం కథాయణం. గుర్తుంచుకోండి - ఎత్తుగడ బలహీనంగా ఉన్న కథ పురిట్లోనే చిత్తౌతుంది. ఎడిటర్ దృష్టిని ఆకట్టుకోటానికి ఎత్తుగడకన్నా ముఖ్యమైనది మరొకటుంది. దాని గురించి వచ్చే వారం ముచ్చటించుకుందాం. అందాకా సెలవ్. - అనిల్ ఎస్. రాయల్
Posted on: Sat, 20 Sep 2014 18:41:23 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015