శ్రీ గూడూరు ప్రసాద రావు - TopicsExpress



          

శ్రీ గూడూరు ప్రసాద రావు గారు శమ్యాప్రాసము లో పోస్టు చేసింది ఇక్కడకు మార్చడమైనది. శాస్త్రీయపరంగా మన ప్రాచీన మేధావులు అలనాటి వైద్యులు చరకుడు : చరకుడు వేదకాలపు మహర్షి. ఆయుర్వేద వైద్యశిఖామణిగా ప్రఖ్యాతుడు. అతి ప్రాచీన ఆయుర్వేద గ్రంథమైన చరక సంహిత ను వ్రాసింది ఈయనే! తర్వాతికాలంలో ఈ గ్రంథాన్ని అరబ్బులూ, పర్షియన్లూ తమ భాషల్లోకి అనువదించుకున్నారు. చరక సంహిత లో 8 విభాగాలున్నాయి. అవి వరుసగా సూత్రస్థాన, నిదానస్థాన, విమానస్థాన, శరీరస్థాన, ఇంద్రియస్థాన, చికిత్సస్థాన, కల్పస్థాన, సిద్ధిస్థాన అనే శీర్షికలతో ఉన్నాయి. ఈ 8 విభాగాల క్రింద 220 అధ్యాయాలు ఎంతో విపులంగా ఇవ్వబడ్డాయి. విరిగిన కాలును అతకడం గురించి చరకుడు స్పష్టంగా వివరించాడు. గ్రుడ్డితనం, పక్షవాతం, కుష్ఠు, మూర్ఛ, క్షయ, రాచపుండు మొదలైన జబ్బులకు సులభమైన నివారణోపాయాలను తన గ్రంథంలో ఇచ్చాడు. వైద్యానికి ఉపకరించే వృక్షాలను వామనతను వృక్షాది విద్య ద్వారా వాటి రూప లక్షణాలు మారకుండా, చిన్నచిన్న మొక్కల రూపంలో పెంచుకునే ప్రక్రియను ఈయన కనుగొన్నాడు. (ఈ పద్ధతి నేడు మరుగుజ్జు వృక్షాల ప్రక్రియ(Bonsai Trees) గా ప్రపంచమంతటా ప్రాకింది). వైద్యంలో పాదరసం వాడకం చరకునికి తెలుసు. ఇది సాధారణ విషయం కాదని ఆధునికవైద్యులే అంగీకరిస్తున్నారు. వాత, పిత్త, శ్లేష్మ దోషాల పరంగా రోగనిర్ధారణ చేయడం, వాటికి తగిన ఔషధ, ధాతువులను నిర్ణయించడంలో చరకుడు హెచ్చు శ్రద్ధ చూపేవాడు. అంటే, చికిత్సకు ముందు రోగకారణాన్ని నిర్ధారణ చేయడం(Diagnosis) ముఖ్యమని భావించేవాడన్నమాట. ఇది ఉత్తమవైద్యుని లక్షణం కదా! చికిత్సా విధానంలో వైష్ణవ దేవతల పేరిట మంత్రాలను ఉచ్చరించడాన్ని సైతం సరైన పద్ధతిగానే చరకుడు పేర్కొన్నాడు. కొన్నిరకాల శబ్దాలు ప్రత్యేక పరిస్థితుల్లో రోగాలపై ప్రభావాన్ని చూపుతాయని ఆధునికవైద్యులు కూడా చెప్తున్నారు. పైన తెలిపిన మంత్రవైద్యం కూడా ఇటువంటిదే! దీన్ని అల్ట్రాసోనిక్ చికిత్సా విధానం గా భావించవచ్చు. శుశ్రుతుడు : శస్త్రచికిత్సా విధానానికి(Operations) మూలపురుషుడు శుశ్రుతుడు. 120 అధ్యాయాలతో శుశ్రుత సంహిత అనే వైద్యగ్రంథాన్ని ఈయన రచించాడు. అరబ్బులు ఈ గ్రంథాన్ని తమ భాషలోకి అనువదించుకున్నారు. శస్త్రచికిత్స చేయాలంటే శరీరం లోపలి భాగాలను గురించి క్షుణ్ణంగా తెలిసివుండాలి. లేకుంటే చాలా ప్రమాదం. అందువల్లనే ముందుగా శవాలను ఖండించడం ద్వారా శస్త్రచికిత్సా విజ్ఞానాన్ని పొందడం శుశ్రుతుడు ప్రవేశపెట్టాడు. శవపరీక్ష (పోస్ట్ మార్టం) చేసి, మరణం ఎందువల్ల సంభవించిందో నిర్ధారణ చేసే విధానాన్ని సైతం ఈయనే ప్రారంభించాడు. ఈ పద్ధతులన్నీ కూడా ఆధునిక వైద్యప్రపంచంలో ఆచరణలో ఉన్నాయి. అపర ధన్వంతరి గా పేరొందిన కాశీరాజైన దివోదాసు వద్ద శుశ్రుతుడు అనేక వైద్య విధానాలను నేర్చుకున్నాడట! శుశ్రుత సంహిత గ్రంథంలో శస్త్రచికిత్సకు సంబంధించిన అనేక విషయాలు వివరంగా చెప్పబడ్డాయి. 24 యంత్రాలను, 101 రకాల శస్త్రచికిత్సా సాధనాలను శుశ్రుతుడు చెప్పాడు. ఇవన్నీ శ్రేష్ఠమైన ఉక్కుతో తయారు చేయబడి, వెంట్రుకను కూడా నిలువునా చీల్చగలిగేటంత వాడిగా ఉండాలని చెప్పాడు. చికిత్సకు వాడే శస్త్రాలకు చేయవలసిన సంస్కారం(Sterilisation), శుచీ శుభ్రతల గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు చక్కగా వివరించాడు. పెద్ద శస్త్రచికిత్సలు చేసేటప్పుడు మత్తుమందు(Anasthesia) తప్పకుండా ఇవ్వాలని చెప్పాడు. ఆపరేషన్ సమయాల్లో రక్తం కారిపోకుండా నరాలను బంధించి ఉంచే విధానాన్ని వివరించాడు. శరీరం పై చర్మానికి 7 పొరలు ఉన్నాయని నిరూపించాడు. యుద్ధ సమయాల్లో శరీరాల్లో నాటుకుపోయిన శస్త్రాలను వెలికి తీయడం గురించి ఎన్నో పద్ధతులను చెప్పాడు. ప్రప్రథమంగా ప్లాస్టిక్ సర్జరీని ప్రవేశపెట్టింది సైతం శుశ్రుతుడే! ప్లాస్టిక్ సర్జరీని త్వచారాపణం అనేవారట. ఈ విధానం ద్వారా కృత్రిమ అవయవాలను అమర్చడం గూర్చి వివరించాడు. తెగిన ముక్కును అతికించడం, చెవికి బదులు క్రొత్త చెవి అమర్చడం చేసి చూపాడు. విరిగిపోయిన ఎముకలను అతికే పద్ధతులను కూడా ఈయన వివరించాడు. శరీరంలో ఏదో ఒకచోట చర్మభాగం లేదా మాంసభాగం చెడిపోతుందనుకోండి. నేడు దానికోసం శరీరంలో మరోచోట చర్మాన్ని లేదా మాంసభాగాన్ని తీసి, చెడిపోయిన చోట వేసి కుడుతున్నారు. ఈ పద్ధతిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినది శుశ్రుతుడే! కంటికి కనిపించని క్రిములు రక్తంలో పుడతాయనీ, అవి అనేక వ్యాధులకు కారణమౌతాయనీ కూడా శుశ్రుతుడు చెప్పాడు. పిండోత్పత్తిని గురించీ, వికృత శిశు జననాలను గురించీ ఇతనికి తెలుసు. వ్రణం అంటే ఏమిటో శాస్త్రబద్ధంగా నిర్వచించిన తొలి విజ్ఞుడు శుశ్రుతుడే! మూలికా ఔషధాలను గురించీ, చెడురక్తాన్ని తొలగించడంలో జలగలను ఉపయోగించడం గురించీ ఈయనకు తెలుసు. మూత్రాశయం లోని రాళ్ళను తొలగించడంలోనూ, కంటి శుక్లాలను అతి సున్నితంగా తీసివేయడంలోనూ ఈయన బహు నేర్పరి. దేహంలో ఆత్మ అనేది ఉందనీ, అది మామూలు కళ్ళకు కనిపించదనీ, జ్ఞానమూ తపస్సూ కలవారికే అది కనిపిస్తుందనీ చెప్పాడు. ఆరితేరిన ఆధునిక వైద్యులు కూడా చెప్పలేకపోయిన విషయం ఇది! పతంజలి : శరీరారోగ్యాన్ని కాపాడగల ఏకాగ్రత, నియమనిష్ఠలతో కూడిన యోగాసనాలు రూపొందించాడు పతంజలి. యోగదర్శనం అనే యోగశాస్త్రాన్ని వ్రాశాడు. ఇందులో 4 పాదాల్లో 195 సూత్రాలను వివరించాడు. పతంజలి యోగశాస్త్ర ప్రకారం, యోగానికి 8 అంగాలు ఉన్నాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేవే ఆ 8 అంగాలు. యమ, నియమాలు మాత్రం అందరూ అన్నికాలాల్లో ఆచరించక తప్పదు. తక్కిన 6 అంగాలు మాత్రం, ఒక్కో మెట్టూ గురువు సాయంతో నేర్చుకోవాలని ఈయన చెప్పాడు. ఈ 8 అంగాల ఆచరణలో మనిషి ఒక అతీతమైన స్థాయిని పొందగలడని వివరించాడు. భగవంతుని తత్త్వాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోడానికి యోగాభ్యాసాలే సులభమార్గమని చెప్పాడు. పతంజలి సిద్ధాంత ప్రకారం మన శరీరంలో కీలకమైన నాడీస్థానాలు కొన్ని, ప్రధానమైన కేంద్రస్థానాలు కొన్ని ఉన్నాయి. ఈ కేంద్రస్థానాలనే చక్రస్థానములు అని పిలిచాడు. ఈ స్థానాలను ప్రేరేపించినప్పుడు మన శరీరంలోని అంతర్గతశక్తి మేలుకొంటుందని చెప్పాడు. ఇలా మేలుకొనే శక్తిని కుండలిని అని సంబోధించాడు. మానసిక, శారీరక స్థితులపై యోగాసనాల ప్రభావం ఎంతయినా ఉంటుందని ఆధునిక యోగశాస్త్ర నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు. భారతీయ యోగాభ్యాసాల పట్ల విశ్వవ్యాప్తంగా ఎంతో ఆదరణ లభిస్తోంది ఈనాడు. యోగాభ్యాసాల ద్వారా ఎంతోమంది ఆయురారోగ్యాలను పెంచుకోగలుగుతున్నారు. కొంతమంది ఆహారం లేకుండా కూడా హెచ్చుకాలం ఉండగలుగుతున్నారు. కొందరైతే గాలిని సైతం పీల్చకుండా యోగాభ్యాసం ద్వారా రోజుల తరబడి ఉండగలరట! జీవకుడు : మన ప్రాచీన వైద్యులలో మరో మేధావి జీవకుడు. ఈయన గౌతమబుద్ధునికి సమకాలికుడు. గాంధారదేశానికి ఒకప్పటి రాజధానియైన తక్షశిల లోని విశ్వవిద్యాలయంలో ఈయన విద్య నభ్యసించాడు. అనంతరం బిందుసారుని ఆస్థానవైద్యుడుగా ఉన్నాడు. ఈయనకు భూమిపై వైద్యానికి పనికిరాని మొక్కే కనిపించలేదట! అంటే, ఎంతటి ఘనవైద్యుడో తెలుస్తూనే ఉందికదా! మెదడుకు సంబంధించిన శస్త్రచికిత్స చేసినవారిలో ప్రథముడు ఈయన. అనగా, ప్రపంచాన మొట్టమొదటి న్యూరోసర్జన్ అన్నమాట. విదేశీ మేధావులంతా అంగీకరించిన విషయమే ఇది.
Posted on: Mon, 15 Sep 2014 13:48:11 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015